కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ సాధ్యమైంది
● బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్టాన్ని సాధించిన పార్టీ బీఆర్‌ఎస్ అని, పదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ఉద్యమ సమయంలో అనేక బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన నవంబర్ 29వ తేదీని దీక్ష దివాస్‌గా జరుపుతున్నామని, దీన్ని విజయవంతం చేసేందుకు ప్రతి తెలంగాణ బిడ్డ దీక్షలో పాల్గొ నాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినందుకే కరెంట్, సాగు, తాగు నీళ్లు, రూ.2వేల పింఛన్లు వచ్చాయన్నారు.
● బీసీలకు 42 శాతం ఇస్తామని మాట తప్పి.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం హడావుడిగా ముందుకు పోతున్న కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. గ్రామాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకొని గెలిచే అభ్యర్థులను సర్పంచ్‌లుగా బరిలో నిలపాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే వారు, ఎన్నికలలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారికి భవిష్యత్‌లో గుర్తింపు ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని, కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని ఈ విషయాన్నీ ప్రజలే కాదు.. సొంత పార్టీ నాయకులే చెప్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు ఇంతియాజ్, రాజేశ్వర్‌గౌడ్, యాదయ్య, బస్వరాజ్, గంజి వెంకన్న, శివరాజ్, బాలరాజు, దేవేందర్‌రెడ్డి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


