భారత రాజ్యాంగమే సర్వోన్నతమైంది
● జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్,రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రపంచంలో భారత రాజ్యాంగమే సర్వోన్నతమైందని మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. పీయూ లా కళాశాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రాజ్యాంగానికి తిరుగులేదని, రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని భారతపౌరులు తప్పప పాటించాలన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లో చట్టం ముందు అందరూ సమానులే అన్న నిబంధన ఉందని, దాన్ని ఆధారంగా ప్రతిపౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు వర్తిస్తాయని, అటువంటి విలువైన అంశాల ఆధారంగా రాజ్యాంగం నిర్మించారన్నారు. అన్ని అంశాల్లో ప్రతిఒక్కరూ సమానంగా ఎదగాలని, సమాన అవకాశాలు రావాలన్న ప్రాథమిక హక్కులతోపాటు పౌరులు చేయాల్సిన విధులను కూడా రాజ్యాంగం ఇచ్చిందన్నారు. సమాజంలో బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించిందని, శాసన కార్యనిర్వాహకవర్గ, న్యాయ వవ్యవస్థలపై పూర్తి అధికారం రాజ్యాంగం కలిగి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థలు సరైన విధానంలో పనిచేయకపోవడం విచారకరమని, ప్రజాస్వామ్యంలో నిజమైన సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుందని, అందువల్ల వారు తమ ఓటుహక్కును సద్వినియోగపర్చుకోవాలన్నారు. ప్రజలు శాసీ్త్రయ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దేశాభివృద్ధిపై తమ కర్తవ్యాలను నిర్వహించాలన్నారు. ప్రస్తుతం భారత్ విశ్వగురువుగా అభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రభుత్వాలు పటిష్టంగా ఉండి సరైన విధానంలో పనిచేస్తేనే దేశం సర్వోన్నతంగా వెలుగొందుతుందన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యాంగం పీఠికతో మొదలవుతుందని, ఈ దేశానికి ప్రజలే మూలం అని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి ప్రజలకు ప్రాతిపదికగా మారుతుందన్నారు. సార్వభౌమత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, గణతంత్రాలతో కూడి భారత రాజ్యాంగం పౌరులకు రక్షణ కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, ప్రిన్సిపాల్ మాళవి, అధ్యాపకులు నూర్జహాన్, ఎస్సీ ఎస్టీసెల్ డైరెక్టర్ కుమారస్వామి, వైస్ ప్రిన్సిపాల్ భూమ య్య, రవికుమార్, బసీర్‌అహ్మద్, పర్వతాలు, నాగసుధ, జావెద్ తదితరులు పాల్గొన్నారు.


