ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ విజయేందిర తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, ఎస్‌ఎస్‌టీ బృందాలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మండలానికి రెండు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో రెండు ఎస్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, గోడరాతలు, హోర్డింగులు, జెండాలు ప్రభుత్వ భవనాలు, పబ్లిక్ ప్రదేశాల్లో తొలగించాలన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేయాల్సి ఉందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు సెలవులు లేవని, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లే పౌరులు వాటికి సరైన ఆధారాలు చూపించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీపీఓ నిఖిల పాల్గొన్నారు.
డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో నార్కోటిక్ జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు చురుగ్గా పనిచేయాలన్నారు. ఉపాధ్యాయులు, యాజమాన్యాలు నిరంతరం పర్యవేక్షించి పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించాలని, గ్రామస్థాయి అధికారులతో నిఘా ఉండేలా పోలీసు శాఖ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎస్‌బీ డీఎస్‌పీ రమణారెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఎంహెచ్‌ఓ కష్ణ, ఎకై ్సజ్ అధికారి నర్సింహారెడ్డి, డీఏఓ వెంకటేశ్, మహిళ శిశు సంక్షేమ అధికారిణి జరీనా బేగం, ఇంటర్మీడియట్ అధికారిణి కౌసర్ జహాన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


