‘బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర’
మెట్టుగడ్డ: బీసీలను రాజకీయంగా అణచివేసే కుట్ర జరుగుతుందని, బీసీలంతా ఏకమై తిప్పికొడదామని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ అన్నారు. బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 23 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం బీసీలను రాజకీయంగా అణిచివేయాలన్న కుట్రలో భాగమేనని ఆరోపించారు. బీసీ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికలలో 23 శాతం రిజర్వేషన్ల అమలును ఎందుకు అడ్డుకోవడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నా వారి పదవుల కోసం పెదవులు మూసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన హామీ మేరకై నా రాహుల్‌గాంధీ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో పోరాడి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, లేకుంటే బీసీలంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వెంకటేష్‌యాదవ్, రాజేందర్, రామ్‌చరణ్, శివ, భరత్, రాఘవేందర్, శ్రీకాంత్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


