ఇక సమరమే.. | - | Sakshi
Sakshi News home page

ఇక సమరమే..

Nov 25 2025 10:45 AM | Updated on Nov 25 2025 10:45 AM

ఇక సమరమే..

ఇక సమరమే..

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఓటర్ల జాబితా నుంచి బ్యాలెట్‌ పేపర్లు, ఎన్నికల సిబ్బంది నియామకం వరకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల అంకం పూర్తికావడంతోపాటు తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల కావడమే మిగిలి ఉంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రకటన విడుదల అవుతుందన్న అంచనాల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

ముగిసిన కసరత్తు..

పంచాయతీ ఎన్నికలను డిసెంబర్‌లోనే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆ దిశగా వేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిజర్వేషన్ల కసరత్తు పూర్తిచేశారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను ముగించింది. అలాగే ఆదివారం నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఇప్పటికే పలు విడతల్లో పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ పూర్తయింది.

పావులు కదుపుతున్న పార్టీలు..

పంచాయతీ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అత్యధిక స్థానాలను కై వసం చేసుకొని సత్తా చాటేందుకు పావులు కదుపుతున్నాయి. గ్రామాల వారీగా తేలిన రిజర్వేషన్ల లెక్కలకు అనుగుణంగా గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తమ నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమకే దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక బీఆర్‌ఎస్‌ ఇప్పటికే విస్తృతంగా పార్టీ సమావేశాలను నిర్వహించగా.. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టే యోచనలో వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ సైతం రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం ద్వారా రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌..

పంచాయతీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. రిజర్వేషన్లపై హైకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉండటంతో వరకు వేచిచూసే ధోరణిలో ఉంది. మంగళవారం వెలువడే తీర్పు తర్వాత రెండు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో గ్రామాల్లో ఆశావహుల సందడి పెరిగింది.

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

తుది ఓటర్ల జాబితా ప్రకటించిన

అధికార యంత్రాంగం

రిజర్వేషన్ల ఖరారుతో

గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం

ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement