గద్వాలలో ఘరానా మోసం
గద్వాల క్రైం: ఓ క్యాంటీన్‌లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తనదైన శైలిలో అందరినీ పరిచయం చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఆయిల్ వ్యాపారంతో తనకున్న పరిచయాలతో తక్కువ ధరకే ఆయిల్(వంటనూనె) సరఫరా చేశాడు. ఆ పరిచయాలతో పెట్టుబడులకు వారితోనే అప్పులు తీసుకున్నాడు. రూ.లక్ష, రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.60లక్షలు తీసుకుని గుట్టుగా జారుకున్నాడు. రెండు మూడు రోజుల్లో ఆయిల్ సరఫరా చేస్తానని చెప్పిన వ్యక్తి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి బాధితులు బుధవారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు.. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన చంద్ర ఆరునెలలుగా గద్వాల బస్టాండ్‌లోని క్యాంటీన్‌లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. క్రమంగా ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. వంటమాస్టర్‌గా పనిచేస్తూనే రిటైల్ వ్యాపారులతో ఆయిల్ కాటన్‌లను కొనుగోలు చేసి చిరు వ్యాపారులకు తక్కవ ధరకు విక్రయించడం మొదలుపెట్టాడు. ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయంతో తనకు తెలిసిన గద్వాల, మల్దకల్, గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన కొందరు వ్యాపారులకు ఆయిల్ కాటన్లు విక్రయించాడు. నాలుగు నెలలుగా వ్యాపారం చేస్తూ పలువురికి నమ్మకం కలిగించాడు. వ్యాపారుల నుంచి భారీమొత్తంలో ఆయిల్ కాటన్‌లను తక్కువ ధరకే సరఫరా చేస్తానని నమ్మించి అడ్వాన్సుల రూపంలో రూ.60లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. చిరువ్యాపారులు స్థానిక ప్రజాప్రతినిధులను కలసి గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పేర్కొన్నారు. మోసపోయిన బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
రంగంలోకి ప్రత్యేక బృందం
ఆయిల్ కాటన్‌ల వ్యాపారం ఘటనపై ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డకు చెందిన చంద్ర వంటమాస్టర్‌పై క్యాంటీన్ నిర్వాహకులు, ప్రైవేట్ డ్రైవర్ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అప్పులు ఇచ్చిన వ్యాపారులు, ఆయిల్ తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారి వివరాలను గుర్తిస్తున్నారు. వంటమాస్టర్‌గా వచ్చి క్యాంటీన్ నిర్వహకులతో పరిచయం.. ఇద్దరు కలసి వ్యాపారం చేశారా? అనే విషయాలపై ప్రత్యేక బృందం నిఘా ఉంచింది. ఈ విషయంపై పట్టణ ఎస్‌ఐ కల్యాణ్ కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. కొంతమంది ఆయిల్ కాటన్‌ల కోసం ముందుస్తుగా అడ్వాన్సులు ఇచ్చినట్లు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుకుంటాం. తక్కువ ధరకే ఆయిల్ కాటన్‌లను సరఫరా చేస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. ఇలాంటి విషయాలపై ముందుస్తుగా పోలీసులకు సమాచారం అందజేయాలని, మోసపోయిన తర్వాత ఫిర్యాదు చేస్తే వారికే నష్టం వస్తుందని, ఇప్పటికై నా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆయిల్ కాటన్ల పేరుతో టోకరా
రూ.60లక్షలతో ఉడాయించిన వంటమనిషి
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
రంగంలోకి ప్రత్యేక బృందం


