
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌లో వేగం పెంచాలి
● నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి
● కలెక్టర్ విజయేందిర బోయి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఏర్పాటు చేసిన వెబ్‌ఎక్స్ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఎన్ని గ్రౌండింగ్ లెవెల్‌లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇల్లు మార్కింగ్ చేసుకోకుండా కట్టుకోవడానికి సిద్ధంగా లేకుంటే వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని వారి దరఖాస్తును రద్దు చేసి, మరొకరికి మంజూరు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులపై వచ్చిన మార్గదర్శకాలు పాటించాలని, ఈ కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జలశక్తి–జలాభియాన్ డేటాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సోషల్ ఆడిట్‌కి సంబంధించి అన్ని రికవరీలు, జరిమానాలపై దృష్టిసారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేసిన వాటిని నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీలు, సీ్త్ర నిధి రుణాలు లక్ష్యం పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్‌డీఓ నరసింహులు, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, డీపీఓ పార్థసారథి, మత్స్య శాఖ ఏడీ రాధా రోహిణి, ఏపీడీలు శారద, ముషాయిర, తదితరులు పాల్గొన్నారు.
‘సిటిజన్ సర్వే’లో అందరూ పాల్గొనాలి
రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్– 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ విజయేందరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వ తేదీతో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in/tela nganarising అనే వెబ్‌సైట్‌ను సందర్శించి తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కోరారు.
నగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు
మహబూబ్‌నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఇబ్బంది కాకుండా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా పైపులైన్‌లు పగిలిన వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడంపై చర్చించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా ఎస్పీడీసీఎల్‌ఎస్‌ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ డీఈ, ఏఈలు ప్రతిరోజు నీటి సరఫరాపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, గ్రిడ్ ఈఈ శ్రీనివాస్, నగర పాలక కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ట్రాన్స్ కో ఎస్‌ఈ రమేష్, మున్సిపల్ డీఈ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.