
అమరవీరులను నిరంతరం స్మరించుకోవాలి
● డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
● పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా వేడుకలు
● జిల్లాకేంద్రంలో శాంతి ర్యాలీ
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్‌శాఖలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు దేశానికి అందించిన అత్యున్నత సేవలకు చిహ్నం అవుతుందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మంగళవారం పరేడ్ మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. మొదట డీఐజీ చౌహాన్‌తో పాటు ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇద్దరు అమరవీరుల కుటుంబసభ్యులు సైతం కంటతడి మధ్య ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ డి.జానకి గతేడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరులైన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అమరుల త్యాగం వల్లే సమాజం శాంతియుతంగా సాగుతోందని, ప్రతి రోజు వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అమరుల సేవలను గుర్తు చేసుకొని మరింత నిబద్ధతో పని చేయాలన్నారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ దేశానికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన నిజమైన వీరులను స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. అమరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోలేనిది అని వారి కుటుంబాలకు పోలీస్‌శాఖ ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు.
● జిల్లాకు చెందిన రెండు అమరవీరుల కుటుంబసభ్యులతో డీఐజీ చౌహాన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా? పోలీస్‌శాఖ నుంచి రావాల్సిన సంక్షేమ ఫలాలపై ఆరా తీశారు.
శాంతి ర్యాలీ
ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని డీఐజీ ప్రారంభించారు. అమరవీరుల కుటుంబసభ్యులతో పాటు డీఐజీ, ఎస్పీలు ర్యాలీలో పాల్గొన్నారు. పాత బస్టాండ్, క్లాక్‌టవర్, రాంమందిర్ చౌరస్తా, వన్‌టౌన్ కూడలి వరకు నిర్వహించారు. అనంతరం అక్కడ దివంగత ఎస్పీ పరదేశినాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

అమరవీరులను నిరంతరం స్మరించుకోవాలి