
విద్యుత్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దని ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని హనుమాన్ పుర ప్రాంతంలో ఎస్‌ఈ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడానికే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో తలెత్తే విద్యుత్ సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. పాత స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాలు, లూజ్ వైర్లు, లో ఓల్టేజీ లాంటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఈ లక్ష్మన్‌నాయక్, మహబూబ్‌నగర్ టౌన్ ఏడీ థావుర్యనాయక్, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.