
వెలుగుల దివ్వెలు..
రాజస్తానీలకు ప్రత్యేకం..
శుభ, సంతోషాలకు సూచిక.. దీపావళి
● చెడుపై గెలిచిన మంచికి
ప్రతీకగా సంబరాలు
● ఇళ్లలో లక్ష్మీపూజకు
ప్రత్యేక ఏర్పాట్లు
● నేడు జిల్లావ్యాప్తంగా వేడుకలు
చీకటి నుంచి వెలుగు వైపు పయనిద్దామని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానానికి ప్రతీక అయిన దీపాన్ని వెలిగించి.. మనలోని అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలని ధార్మికవేత్తలు ప్రజలను మేల్కొలుపుతారు. దీపాన్ని జ్ఞానానికి, సంతోషానికి, నిర్మలత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. అలాంటి దీపం ప్రాముఖ్యత తెలిపే విధంగా ఏర్పాటు చేసిందే ఈ దీపావళి పర్వదినం. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. సోమవారం జిల్లాలో ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించుకోనున్నారు. ప్రాంత భేదాన్ని అనుసరించి దీపాలిక, కౌముదీ మహోత్సవం, దివ్వెల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలిగించిన దీపాలు స్వర్గానికి దారి చూపిస్తాయని విశ్వసిస్తారు. దీపావళి రోజు దీపాలు వెలిగిస్తే దేవతలు కరుణిస్తారని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి ఇంట్లో దీపాల వరుసలు కనిపిస్తూ శుభసంకేతాలు ప్రసరిస్తాయి. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడు, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.
రాజస్తాన్ మార్వాడీలకు దీపావళి ప్రత్యేకమని చెప్పవచ్చు. దాదాపు వందేళ్ల క్రితమే రాజస్తాన్‌కు చెందిన మార్వాడీల కుటుంబాలు పాలమూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం చాలా కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం నగరంలో 150కిపైగా రాజస్తాన్ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడే ఉంటున్నప్పటికీ రాజస్తాన్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగలు జరుపుకొంటారు. ముఖ్యంగా దీపావళిని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. మొదటి రోజు ధన్‌తేరాస్ జరుపుతారు. ఇంటిల్లిపాది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండోరోజు రూప్ చౌదాస్ వేడుకలు ఉంటాయి. కాగా.. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి పూజలు నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. నాలుగో రోజు గోవర్ధన్ పూజ (ఆవుపేడతో) నిర్వహిస్తారు. ఐదోరోజు బైదూజ్ వేడుకలు చేసుకుంటారు. వీరు గుంజ, బేసన్ చక్కి, పేటతోపాటు బెల్లంతో తయారుచేసిన తీపి వంటకాలు చేస్తారు.
– స్టేషన్ మహబూబ్‌నగర్
హైందవ పర్వదినాల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించి ప్రత్యేకంగా లక్ష్మి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. దీపావళి రోజున లక్ష్మీపూజతో ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు.
– గొండ్యాల రాఘవేంద్రశర్మ, ప్రధాన అర్చకులు,
శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం

వెలుగుల దివ్వెలు..