
జిల్లాకేంద్రంలో దీపావళి సందడి..
పాలమూరు పట్టణంలో రెండు, మూడు రోజుల నుంచి దీపావళి పండుగ సందడి నెలకొంది. బాణాసంచా స్టాళ్ల వద్ద చిన్నారులు, పెద్దలు టపాసులు కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ టపాసుల కొనుగోలుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా మహిళలు వివిధ రకాల ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. షాపుల్లో కూడా దీపావళి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని పలుచోట్ల ప్రత్యేకంగా పూల స్టాళ్లు వెలిశాయి.
జడ్చర్ల టౌన్: దీపావళి సందర్భంగా గోగునార కట్టలతో చేసిన దుందువాతో దిష్టి తీస్తారు. జడ్చర్ల మండలంలోని చాలా గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. పొలాల్లో ఉన్న జీనుగ, పుంటికూర (గోగునార) కట్టెలు తీసుకువచ్చి వాటిని కట్టలా తయారు చేసి చిన్న చిన్న గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి దిష్టితీయడం ఆనవాయితీగా వస్తుంది. దీన్ని వాడుక భాషలో దుందువాగా వ్యవహరిస్తారు. దిష్టి తీశాక పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడం చేస్తారు. దీన్ని ఉల్కాదానంగా పిలుస్తారు. పితృదేవతలకు దక్షిణ దిక్కుగా దీపం వెలిగించడం వల్ల స్వర్గానికి వెళ్లేందుకు దారి చూపినట్లవుతుందని భావిస్తారు. దీపం వెలిగించాక పిల్లలు కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చి పూజాగృహంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కారం చేయాలి. సోమవారం సాధారణ నోములు, వ్రతాలు, లక్ష్మీపూజలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే కేదారేశ్వర వ్రతం ఆచరించే వారు మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారమే చతుర్దశి కూడా ఉండడంతో ఉదయం భోగి మంగళహారతులు స్వీకరించి.. సాయంత్రం నోములు చేసుకోనున్నారు.
● లక్ష్మీచెన్నకేశవస్వామి కొలువైన గంగాపురం గ్రామంలో పెద్ద దుందువాతో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కార్తీక పాడ్యమి రోజున ఈ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది బుధవారం రోజున దుందువా వేడుకలను జరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.