
ఆకట్టుకుంటున్న ‘ప్రమిదలు’
దీపావళి పండుగలో ప్రమిదలు (మట్టి దీపాలకు) ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగకు ఇంటిల్లిపాది దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. గత మూడు రోజుల నుంచి దీపాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వివిధ డిజైన్లలో దీపావళి ప్రమిదలు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలోని ఏనుగొండ, పద్మావతీకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి, జిల్లా పరిషత్ ఎదుట, మల్లికార్జున్ చౌరస్తా, అశోక్‌టాకీస్ చౌరస్తా, క్లాక్‌టవర్, బస్టాండ్, పాన్‌చౌరస్తాలతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి..
కొంతమంది స్టాళ్ల నిర్వాహకులు కొన్ని ప్రమిదలను ఇక్కడే తయారు చేసి విక్రయిస్తున్నారు. వివిధ డిజైన్ల ఆకర్షణీయమైన మట్టి దీపాలను తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అవుతుండగా అక్కడి నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమిదల పరిణామం, డిజైన్‌ను బట్టి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గాజుతో చేసిన దీపాలు, కందీల్ దీపాలు, ఐదు క్యాండిల్స్ దీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నపాటి దీపాలు డజన్ రూ.50 నుంచి అమ్ముతుండగా.. ఇతర దీపాలు రూ.1,600 వరకు కూడా లభిస్తున్నాయి. వాటర్ ఫ్లవర్ రూ.150 నుంచి రూ.200, ఎలక్ట్రిక్ ప్రమిద రూ.200 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు.