
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వాధీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్‌కు తెలిపారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వాధీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్‌కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది.