
‘నక్కలగండి’ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెంచాల్సిందే..
అచ్చంపేట రూరల్: నక్కలగండి ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్న తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పెంచడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. అచ్చంపేట మండలం మార్లపాడుతండా, కేశ్యాతండాల్లో సోమవారం అదనపు కలెక్టర్ అమరేందర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించగా.. ముంపు బాధితులు తమ సమస్యలను వెలిబుచ్చారు. ఇంటి ఖాళీ స్థలాలకు గజం రూ. 3వేల చొప్పున చెల్లించడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, పట్టణాల సమీపంలో ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. అదే విధంగా ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధిపరిచి ముంపు బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. చేపలు పట్టేందుకు హక్కులు కల్పించాలని.. మైదాన ప్రాంతానికి వెళ్లినా ఏజెన్సీ హక్కులు వర్తింపజేయాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ సైదులు, ఆర్‌ఐ బాల్‌రాం, నాయకులు భాస్కర్, రవి ఉన్నారు.