
గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: క్రీడల్లో గెలుపు, ఓటములను క్రీడాస్ఫూర్తితో సమానంగా తీసుకోవాలని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు శాంతికుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ బాలబాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని ఆయన మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. కోచ్‌లు చెప్పే సలహాలు, సూచనలను పాటించాలన్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. ఎంపిక కానివారు బాధపడవద్దని, భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ఎంపికల్లో జిల్లావ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, దామోదర్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, రాములు, ముత్యం, రాంచంద్రయ్య, శ్రీహరి, ఉమామహేశ్వర్‌రెడ్డి, తిరుపతయ్య, నర్సింలు, బాల్‌రాజు, శ్రీనివాసులు, గణేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.