
మద్దెలబండలో చిరుత సంచారం
మల్దకల్: మండలంలోని మద్దెలబండ గ్రామ సమీపంలోని ఊరగట్టు నర్సింహులు వ్యవసాయ పొలం వద్ద శనివారం తెల్లవారుజామున చిరుతపులి సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ పొలం వద్ద పశువుల కొట్టం వద్ద కాపలాగా ఉన్న నర్సింహులు కుక్కలపై దాడి చంపినట్లు బాధితుడు తెలిపారు. పొలం పరిసరాల్లో ఉన్న గుట్టల్లో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఫర్వేజ్ అహ్మద్, ఎఫ్‌ఎస్‌ఓ ప్రసూన, ఎఫ్‌డీఓ కీర్తి చిరుత జాడలను గుర్తించారు. కుక్కలపై దాడి చేసి చంపింది చిరుతేనని వారు నిర్దారించారు. ధరూరు మండలం కొత్తపాలెంలో ఇటీవలే వ్యవసాయ పొలంలోని పశువులపై దాడి చేసిన చిరుతే ఇక్కడ సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులు ఎవరూ ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లొద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచొద్దని సూచించారు. అదే విధంగా మద్దెలబండ గ్రామంలో దండోరా వేయించాలని అధికారులకు సూచించారు.