
మన్యంకొండకు ‘శ్రావణ శోభ’
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రావణశోభ రాబోతుంది. ఈనెల 25వ తేదీ నుంచి దేవస్థానంలో శ్రావణమాసపు ప్రత్యేక విశేషోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకుగాను దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెలరోజులపాటు దేవస్థానంలో పలు పూజా కార్యక్రమాలతోపాటు ప్రతిరోజు శాంతిహోమాన్ని నిర్వహిస్తారు. నెలలో ప్రత్యేక దినోత్సవాల రోజుల్లో పలు పూజలు నిర్వహిస్తారు. విశేషోత్సవాల సందర్భంగా స్వామివారిని బంగారు అభరణాలతో అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి శేషవాహనసేవా నిర్వహిస్తారు. ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు వేయి తులసీదళాలతో ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
విశేషోత్సవాలు...
దేవస్థానంలో ఈనెల 25వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో శ్రావణమాస విశేషోత్సవాలను ప్రారంభిస్తారు. ఈనెల 29న నాగుల (గరుడ పంచమి), ఆగస్టు 5న ఏకాదశి, శ్రీవిష్ణుసహస్రనామ అఖండ పారాయణం నిర్వహిస్తారు. 9న ఉదయం 11 గంటలకు స్వామివారి కల్యాణం (రాఖీ పౌర్ణమి), హయగ్రీవ జయంతి (రాత్రికి శేష వాహన సేవ), 16న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్ల కార్యక్రమం, శ్రీ హనుమద్దాసుల కీర్తనలతో అఖండ భజన 24 గంటల పాటు జరుగుతుంది. అలాగే 28న గురుపంచమి బ్రుషిపంచమి సమారాధన, శ్రావణమాస హోమ పూర్ణాహుతి, సమారాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. శ్రావణమాస విశేషోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాతృలు కావాలని కోరారు.
నేటినుంచి విశేషోత్సవాలు ప్రారంభం
ప్రతిరోజూ శాంతిహోమం, తులసీనామార్చన
స్వర్ణాభరణ అలంకరణలో దర్శనమివ్వనున్న స్వామివారు