
చిన్నారిని వదిలేసిన గుర్తు తెలియని మహిళ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని ఆవరణలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ ఆరు నెలల ఆడ శిశువును వదిలేసి వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా జనరల్ ఆస్పత్రి ఆవరణలోని ఆక్సిజన్ ట్యాంక్ పక్కనే ఆరు నెలల ఆడ శిశువును వదిలేసి వెళ్లారు. పాప ఏడుస్తుండటంతో గమనించిన స్థానికులు ఆర్‌ఎంవో శిరీషకు సమాచారం ఇవ్వగా వెంటనే సదరు చిన్నారిని ఎస్‌ఎన్‌సీయూకు తరలించి చికిత్స అందించారు. ఆ చిన్నారికి గ్రహణం మొర్రి ఉండటం వల్లే సదరు మహిళ అక్కడ వదిలేసినట్లు స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం చిన్నారి ఆయాసంతో ఇబ్బంది పడటం, పల్స్‌రేట్ తగ్గడంతో కొంత కండీషన్ ఇబ్బందికరంగా ఉందని, ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స అందిస్తున్నామని ఆర్‌ఎంవో తెలిపారు. ఈ ఘటనపై ఆస్పత్రి మరో ఆర్‌ఎంవో సమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు.
గంజాయికి బానిసైనమారిన ఆటోడ్రైవర్
మహబూబ్‌నగర్ క్రైం: గంజాయికి ఓ 22 ఏళ్ల ఆటోడ్రైవర్ పూర్తిగా బానిసగా మారడంతో చివరకు డి–అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన 22 ఏళ్ల యువకుడు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల గంజాయి తాగడం అలవాటు చేసుకొని దానికి బానిసగా మారాడు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ట్యాంక్‌బండ్‌పై గంజాయి తాగుతున్నట్లు వచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో కోర్టు అనుమతితో సదరు యువకుడిని డి–అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

చిన్నారిని వదిలేసిన గుర్తు తెలియని మహిళ