
జూరాలకు భారీగా తగ్గిన వరద
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఆదివారం వరద భారీగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. కేవలం ఒక క్రస్ట్‌గేట్ ఎత్తి 6,823 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. జల విద్యుదుత్పత్తి నిమిత్తం 36,035 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 45, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 470, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 950, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.087 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆదివారం ఎగువన 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 115.731 మి.యూ., దిగువన 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 137.467 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని ఎస్‌ఈ శ్రీధర్ వివరించారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 253.198 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు.
నిండుకుండలా కృష్ణమ్మ..
కొల్లాపూర్: కృష్ణానది నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ లేవెల్ పెరిగింది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తుండటంతో ఫుల్‌గేజ్‌కు 2 ఫీట్ల మేర దిగువకు చేరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ లేవల్ ఫుల్‌గేజ్ 885 అడుగులు కాగా.. ఆదివారం 883.30 అడుగులు ఉన్నట్లు అధికారులు వివరించారు. సోమశిల, అమరగిరి, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, చెల్లెపాడు పుష్కరఘాట్ల పైకి నీరు చేరుకోవడంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
సుంకేసుల 10 గేట్లు ఎత్తి..
రాజోళి: సుంకేసుల జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల వరద రాగా.. 39,170 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు పేర్కొన్నారు.
కేవలం 65 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
ఒక క్రస్ట్ గేట్ ఎత్తి దిగువకు విడుదల
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి