
జడ్చర్లలో భారీ చోరీ
జడ్చర్ల: తాళం వేసి ఇంట్లోకి చొరబడి 20 తులాల బంగారు నగలు అపహరించిన ఘటన జడ్చర్లలో చోటుచేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. జడ్చర్ల శ్రీ సాయి వంశీ కాలనీలో నివాసం ఉంటున్న గడ్డంపల్లి వరలక్ష్మి శనివారం తన కూతురితో కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి బోనాల పండుగ సందర్భంగా వెళ్లారు. ఆదివారం ఉదయం పక్క ఇంటికి చెందిన వారు గేటు తాళం విరగ్గొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే ఇంటి యజమానురాలికి ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో ఇంటి యజమాని హుటాహుటీన ఇంటికి చేరుకుని చిందర వందరగా పడి ఉన్న వస్తువులను పరిశీలించారు. బీరువాలో దాచి ఉంచిన 20 తులాల బంగారు నగలు, కొంత నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. గాజులు, చంద్రహారం, రెండు నక్లెస్‌లు, కమ్మలు, ఉంగరాలు మొత్తం 20 తులాల నగలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏఎస్పీ రత్నం సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో 20 తులాల
బంగారు నగలు అపహరణ