
జూరాలకు స్వల్పంగా తగ్గిన వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 1.28 లక్షల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం సాయంత్రానికి 1.22 లక్షలకు చేరిందన్నారు. దీంతో ప్రాజెక్టు 14 క్రస్ట్‌గేట్లను పైకెత్తి 94,878 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 28,658 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.933 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
శ్రీశైలంలో మూడు గేట్లు ఎత్తి..
దోమలపెంట: శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లను పైకెత్తి 80,646 క్యూసెక్కుల నీటిని బుధవారం దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. 1,81,051 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుండగా.. 882.4 అడుగుల నీటిమట్టం, 201.1205 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,978 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్‌కు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు 19,166 క్యూసెక్కులు, రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 1,266 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.657 మి.యూ., ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 17.478 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు.
కోయిల్‌సాగర్‌లో 23 అడుగులు..
దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయంలో బుధవారం సాయంత్రం 23 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 3.6 అడుగుల నీరు చేరితే పాత అలుగుస్థాయి 26.6 అడుగులకు.. మరో 9.6 అడుగుల నీరు చేరితే పూర్తిగా నిండుతుందన్నారు.
14 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
సుంకేసుల జలాశయంలో..
రాజోళి: సుంకేసుల జలాశయం 15 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 55 వేల వరద రాగా.. దిగువకు 57,515 క్యూసెక్కులు వదిలినట్లు చెప్పారు. ప్రస్తుతం జలాశయంలో 0.608 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.