
జాగ్రత్తలతో ప్రమాదాలకు దూరం
సూచనలు :
● ఆకాశం మేఘామృమైనపుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
● వర్షంలో తడవకుండా ఉండటానికి చాల మంది చెట్లను ఆశ్రయిస్తారు. అది సరైన పద్ధతి కాదు
● పిడుగులు ఎక్కువగా చెట్లపైనే పడతాయి. కాబట్టి చెట్లకు దూరంగా ఉండాలి
● ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో వర్షంలో ఉండరాదు
● సెల్‌ఫోన్లు ఉంటే వాటిని స్విచ్‌ఆఫ్ చేసుకోవాలి
ఇలా పలు జాగ్రత్తల ద్వారా వర్షాకాలంలో సంభవించే ప్రమాదాల నుంచి రైతులు తప్పించుకోవచ్చని సూచనలు, సలహాలు అందజేశారు.
అలంపూర్: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జోరు వర్షాలు, ముసురు, మరోవైపు విషసర్పాల సంచారంతో రైతులు ప్రమాదాలతో సావాసం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు పలు సూచనలు చేశారు.
విష సర్పాల బెడద..
వర్షాలు కురవగానే పాములు బయటికి వస్తుంటాయి. గట్ల వెంట, చెట్లు, పిచ్చి మొక్కలు, బండరాళ్లు, గడ్డివాములు ఉన్న చోట పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. రైతులు పొలం పనులకు వెళ్లే దారిలోను పనుల్లో నిమగ్నమై గట్ల వెంట నడుస్తూ పాముకాటుకు గురైన సంఘటనలు అనేకం ఉంటాయి.
జాగ్రత్తలు..
● చీకటి సమయాల్లో పూర్తిగా చార్జింగ్ చేసిన టార్చ్‌లైట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి
● చేతిలో కర్రను వెంట పట్టుకొని వెళ్లాలి.
● తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలి. బూట్లు ధరిస్తే ఇంకా మంచిది
● పొలం గట్లపై నడుస్తున్నప్పుడు చప్పుడు చేసుకుంటు వెళ్లాలి
● పాముకాటుకు గురైతే తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించాలి
● నాటు వైద్యంపై ఆధారపడొద్దు
వాగులు.. వరద ఉధృతి
వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుంటాయి. వ్యవసాయ పనులకు వెళ్లే దారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రైతులు పొలాల నుంచి వచ్చే సమయాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించాలి.
జాగ్రత్తలు:
● నీటి ఉధృతి ఎలా ఉందో ముందుగా గమనించాలి
● ఒంటరిగా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకూడదు
● పశువులను దాటించే సమయాల్లో మరింత జాగ్రత్త అవసరం
పిడుగులు, మెరుపులు
● వర్షాకాలంలో పిడుగులు సహజంగా పడుతుంటాయి. చెట్లు ఉన్న ప్రదేశాల్లో పిడుగు పడే అవకాశం అధికంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.