
రేషన్ కార్డు కోసం..
మహబూబ్‌నగర్ రూరల్: రేషన్ కార్డు కోసం కరీంనగర్ జిల్లాలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడికి మహబూబ్‌నగర్ జిల్లాలో మంజూరు అయింది. అధికారుల తప్పిదం కారణంగా అక్కడ జారీ చేయాల్సిన కార్డు ఇక్కడ రావడంతో లబ్ధిదారుడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్ కొత్త రేషన్ కార్డు కోసం తన ఆధార్ కార్డు గుర్తింపుగా స్థానికంగా దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన కార్డు జారీకి సంబంధించిన ప్రక్రియ నిర్వహించిన సంబంధిత శాఖ సిబ్బంది, అధికారులు కార్డు కోసం కరీంనగర్‌కు బదులుగా మహబూబ్‌నగర్ అని కంప్యూటర్‌లో పొందుపరిచారు. దీంతో ఆయనకు మహబూబ్‌నగర్‌లోని 1425022 రేషన్ షాపును కేటాయించారు. తనకు పొరపాటున జారీ చేసిన కార్డును రద్దు చేసి కొత్తది తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఇవ్వాలని కరీంనగర్ జిల్లా అధికారులకు విన్నవించుకోగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో జారీ చేసిన కార్డు రద్దు చేస్తేనే నూతనంగా కరీంనగర్ జిల్లాలో కార్డు జారీ చేస్తామని తిరకాస్తు పెట్టారు. అంతేకాక అధికారులు చేసిన తప్పిదానికి తనను బలి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా తనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కార్డు జారీ చేయాలని లక్ష్మణ్ కోరుతున్నారు.
కార్డును రద్దు చేస్తాం..
కరీంనగర్ తహసీల్దార్ కార్యాలయంలో నమోదు మేరకు రేషన్ కార్డు మహబూబ్‌నగర్‌లో జారీ అయ్యిందని మహబూబ్‌నగర్ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు. అక్కడి అధికారుల పొరపాటు కారణంగా ఇక్కడి జారీ అయిన కార్డును రద్దు చేసి లబ్ధిదారుడికి అసౌకర్యం కలగకుండా చూస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్‌లో దరఖాస్తు.. మహబూబ్‌నగర్‌లో మంజూరు
అధికారుల తప్పిదంతో లబ్ధిదారుడికి అవస్థలు