
పాలమూరులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు
స్టేషన్ మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరును విద్యాహబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు, ఈ మేరకు ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థ ఏర్పాటు కానున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు మహబూబ్‌నగర్‌లో విద్యాసంస్థ ట్రిపుల్ ఐటీని తీసుకురావడంలో సఫలీకృతమైనట్లు తెలిపారు. ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో విద్యాసంస్థల ఆవశ్యకత గురించి తెలియజేశామని, దీంతో నగరంలో బాసర తరహా ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు వివరించారు. ట్రిపుల్ ఐటీని మహబూబ్‌నగర్‌కు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్‌ఐటీ ఏర్పాటుకు సంబంధించి త్వరలో జీఓ రానున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయని, సీఎం అందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ ట్రిపుల్ ఐటీ ఇక్కడికి రావడానికి ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి సీఎంతో ప్రస్తావించారని, అందరి సమష్టి కృషితో విద్యాసంస్థ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్ మీదుగా శ్రీశైలం క్షేత్రానికి బస్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో కొన్ని వేల మంది వెళుతుంటారని, ఇక్కడ ఇంటర్ స్టేట్ బస్టాండ్ అవసరాన్ని సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. జిల్లాకేంద్రానికి సమీపంలో ఇంటర్ స్టేట్ ఏర్పాటుకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు. మన్యంకొండ దేవాలయం అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలో మహబూబ్‌నగర్ అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు అవేజ్ అహ్మద్, మహేందర్, సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
● జిల్లాలో ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు కోసం బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని దివిటిపల్లిలో శనివారం స్థల పరిశీలించారు. కళాశాల ఏర్పాటుకు 40 నుంచి 50 ఎకరాల భూమి అవసరం పడుతుందని, విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పిచేందుకు భవనాలు తదితర అవసరాలు తీర్చేందుకు నిధులు కూడా అవసరం పడతాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.