
పాలమూరుకు ప్రపంచ సుందరీమణులు
మహబూబ్‌నగర్ క్రైం: హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చే ప్రపంచంలోని వివిధ దేశాల సుందరీమణులు ఈ నెల 16న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. 22మందితో కూడిన బృందం 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించనున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకు జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే సుందరీమణులు.. 16న పిల్లలమర్రికి విచ్చేస్తున్న నేపథ్యంలో మూడంచెలతో కూడిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన పిల్లలమర్రిని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పిల్లలమర్రిలో చేపట్టాల్సిన రక్షణ, బందోబస్తు చర్యలపై అధికారులతో చర్చించిన అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఐజీ మాట్లాడారు. దేశంలో మూడోసారి జరుగుతున్న అందాల పోటీలకు పలు దేశాల నుంచి పోటీ చేసే వారు వస్తున్న క్రమంలో పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారి పర్యటనను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మూడంచెల భద్రత కోసం వెయ్యి మంది పోలీస్ సిబ్బందిని కేటాయిస్తున్నామన్నారు. జాతీయ రహదారితో పాటు పిల్లలమర్రి వరకు రోడ్డు వెంట భద్రత ఉంటుందని.. ప్రధానంగా ముఖద్వారం నుంచి అతిథులకు పిల్లల మర్రి చరిత్ర, విశిష్టతను స్థానిక అధికారులు తెలియజేస్తారని అన్నారు. వారు వచ్చే రోడ్డు మార్గంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉండే వారు హుందాగా ఈ ప్రాంత ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలని కోరారు. 360 డిగ్రీలలో ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చిన్న పొరపాటు జరిగినా దేశం, రాష్ట్రం, మన ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. మిస్ వరల్డ్స్ వచ్చిన సమయంలో స్థానికంగా ఉన్న పర్యాటకులు వచ్చిన అతిథులకు ఇబ్బందులు కలగకుండా.. ఎవరికి వారు మర్యాదగా, హుందాగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు గాంధీ నాయక్, భగవంతురెడ్డి, అప్పయ్య పాల్గొన్నారు.
16న పిల్లలమర్రిని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు
వెయ్యి మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రత
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ సత్యనారాయణ