కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన అన్నదాతలు
గోపాల్‌పేట: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జాప్యంపై మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. మండలంలోని బుద్దారం గ్రామంలో మొత్తం నాలుగు కేంద్రాలు ఉండగా ప్రారంభంలో కొన్నిరోజులు మాత్రమే కాంటా చేసి ధాన్యం తరలించారని.. సుమారు వారం రోజులుగా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో ఆరబెట్టిన ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వెంటనే లారీలు రప్పించి కొనుగోలు చేసిన ధాన్యం తరలించాలని, కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధాన్యం తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఒక లారీ ధాన్యం తరలించినట్లు గ్రామ రైతులు తెలిపారు.
గోవర్ధనగిరిలో..
వీపనగండ్ల: కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మంగళవారం మండలంలోని గోవర్ధనగిరిలో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కుప్పల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మకై ్క తాలు, మట్టి పెడ్డలంటూ కోత విధించాలని చూస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వరలక్ష్మి అక్కడకు చేరుకొని ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, చిన్న బిచ్చారెడ్డి, పరమేశ్, నర్సింహ, మహేష్, వెంకటేశ్వర్లు, మహబూబ్‌పాషా, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన అన్నదాతలు


