హైదరాబాద్‌లో ఏదుట్ల వాసి ఆత్మహత్య
గోపాల్‌పేట: మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో ఉరేసుకొని మరణించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దక్షణమూర్తి, తిరుపతమ్మల కుమారుడు రంగయ్య (40) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం రాత్రి పనికి వెళ్లిన చోటే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సబ్యులు హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చెరువులోకి దూసుకెళ్లిన ఎద్దుల బండి
● నీట మునిగి ఎద్దులు మృత్యువాత
అమరచింత: ధాన్యం బస్తాలను ఎడ్లబండిపై రైస్‌మిల్లుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువు కట్టను దాటుతుండగా ఎద్దులు భయపడి చెరువులోకి దూసుకెళ్లడంతో నీట మునిగి రెండు ఎద్దులు మృతి చెందగా రైతు బయటపడిన ఘటన మండలంలోని నందిమళ్ల గ్రామంలో ఆదివారం జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు మాల నరసింహులు తన ఎడ్లబండిపై వరిని బియ్యంగా మార్చడానికి ధాన్యం సంచులతో ఆత్మకూర్‌లోని రైస్ మిల్లుకు బయలు దేరాడు. గ్రామంలోని చెరువు కట్టను దాటుతుండగా ఎద్దులు ఒక్క సారిగా భయపడి పరుగు తీశాయి. దీంతో బండితో సహా చెరువులో పడిపోయాయి. పరిస్థితిని గమనించిన రైతు అప్పటికే కిందకు దూకడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. విషయాన్ని సమీపంలో ఉన్న రైతులకు తెలుపగా రైతులు, గ్రామస్తులు వచ్చి చెరువులో పడిపోయిన ఎడ్ల బండిని తాడుతో ట్రాక్టర్‌కు కట్టి బయటకు లాగారు. అప్పటికే ఎద్దులు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి తెలిపారు. నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
జడ్చర్ల: అనుమానస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బోయలకుంట శివారులో చోటు చేసుకుంది. మృతుడి భార్య వెంకటమ్మ కథనం మేరకు.. బోయలకుంటకు చెందిన జాజాల వెంకటేశ్ (60) బోయలకుంట శివారులోని సర్వే నంబర్లు 167, 168, 162లో 3.12 ఎకరాల భూమి ఉంది. భూమికి సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని, చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంలో గల పశువుల కొట్టంలో తాడుతో ఉరి వేసుకుని అనుమానస్పదంగా మృతి చెందినట్లు గుర్తించామన్నారు. భూమికి సంబంధించి ఐదు రోజుల కిందట కొందరు తమ వద్దకు వచ్చి భూమి తమదంటూ బెదిరింపులకు గురిచేశారని, దీంతో మానసిక వేధన, భయాందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. మరే విధంగానైనా చనిపోయాడా అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. భూమికి సంబంధించి తమ వద్ద పట్టాదారు పాసు పుస్తకం, తదితర అన్ని ఉన్నా పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన భర్త మృతిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఏదుట్ల వాసి ఆత్మహత్య


