పొన్నకల్ చెరువులో ఆటో బోల్తా
అడ్డాకుల: మండలంలోని పొన్నకల్ చెరువులో ఆటో బోల్తాపడగా అందులో ఉన్న ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా.. రాచాలకు చెందిన దాసరి ఆంజనేయులు తన ఆటోలో దాసరి కురుమూర్తి, దాసరి నర్సింహులు, దాసరి వెంకటేశ్వరమ్మ, మడిగెల రవిశంకర్‌ను జాతీయ రహదారి వద్ద దింపేందుకు ఊళ్లో ఆటో ఎక్కించుకున్నాడు. దుబ్బపల్లి స్టేజీ దాటిన తర్వాత పొన్నకల్ నల్ల చెరువుకట్టపై మేకలు అడ్డువచ్చాయి. వాటిని తప్పించేందుకు డ్రైవర్ ఆంజనేయులు ఆటోను పక్కకు తిప్పగా ఆటో అదుపు తప్పి.. చెరువు కట్ట లోపలికి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆటోలో ఉన్న కొందరు ఆటో నీళ్లలో పడేలోపే వెంటనే అందులోంచి పక్కకు దూకగా.. డ్రైవర్ ఆంజనేయులు, మరొకరు ఆటోతోపాటు నీళ్లలో మునిగిపోయారు. ఎలాగోలా ప్రయత్నించి ఆటోలోంచి బయటకు వచ్చి ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. డ్రైవర్ ఆంజనేయులు, మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌లో జిల్లా కేంద్రానికి తరలించారు. అటుగా వెళ్తున్న కలెక్టర్ విజయేందిర ఘటనా స్థలం వద్ద ఆగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. తర్వాత స్థానికులు తాళ్ల సాయంతో ఆటోను బయటకు తీశారు. ఇదిలా ఉండగా.. అదుపు తప్పిన ఆటో చెరువు లోపలికి దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. చెరువుకు మరోవైపు దూసుకెళ్తే లోతైన పొలాల్లో పడి పెద్ద ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు.
త్రుటిలో ప్రాణాపాయం నుంచి
తప్పించుకున్న ప్రయాణికులు


