
సులభశైలిలో రచించడం అభినందనీయం
నాగర్‌కర్నూల్ క్రైం: గుడిపల్లి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి నాటకాల్లో నిరంతరం పాల్గొంటూ కవిగా, రచయితగా 18 పర్వాల మహాభారతాన్ని సులభశైలిలో అందరికి అర్థమయ్యేలా రచించడం అభినందనీయమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో గుడిపల్లి నరసింహారెడ్డి రచించిన సంక్షిప్త మహాభారతం పుస్తకావిష్కరణ కార్యక్రమం కందనూల్ కళాసేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తకాలు చదవడమే మహాభాగ్యంగా ఉన్న ఈ కాలంలో మహాభారతాన్ని అధ్యయనం చేసి దానిలోని సారాంశాన్ని గ్రహించి నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలకు అన్వయించి సులభతరంగా సంక్షిప్తంగా చక్కటి పుస్తకం అందించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కవి వనపట్ల సుబ్బయ్య, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షుడు దినకర్, రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు నారాయణరెడ్డి, పెబ్బేటి నిరంజన్, కల్లకోల్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ గోరటి వెంకన్న