
విత్తన నాణ్యతపై నజర్
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈసారి వ్యవసాయశాఖ ప్రత్యేకంగా విత్తన నాణ్యతపై దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. పత్తి, వరితోపాటు ఇతర విత్తనాల నమూనాలు సేకరించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. బీజీ–3 పత్తి విత్తన నియంత్రణకు జిల్లా పరిధిలోని సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో ఆరు బృందాలతో భూత్పూర్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోని పలు విత్తన ఉత్పత్తి కంపెనీల్లో హెచ్‌టీ (హిర్చిసెంట్ టాలరెంట్) టెస్ట్ నిర్వహించారు. మొత్తం 38 లాట్‌లలో టెస్టులు చేయగా.. ఎలాంటి బీజీ–3 పత్తి విత్తన నిల్వలు లేవని వ్యవసాయ శాఖ తేల్చింది. జిల్లాలో ఇప్పటి వరకు 15 పత్తి విత్తనాల నమూనాలను సేకరించి రాజేంద్రనగర్ ల్యాబ్‌కు పంపించారు. జిల్లాలో 2024 వానాకాలం సీజన్ ప్రారంభం నుంచి 2025 మార్చి నెలాఖరు వరకు మొత్తం 350 వరి, పత్తి, కంది, ఇతరత్రా విత్తన నమూనాలను సేకరించాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖకు టార్గెట్ విధించింది. ఆ దిశగా వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రైతులపై అదనపు భారం
ఈసారి పత్తి విత్తన పాకెట్ల ధర రూ.11 పెరిగింది. గతేడాది 450 గ్రాముల పాకెట్ ధర రూ.853 ఉండగా.. ఈ ఏడాది రూ.864కు విక్రయిస్తున్నారు. అలాగే వరి విత్తనాలపై రూ.50 పెరిగింది. గతంలో 1010 వరి విత్తనాలు బస్తా (30 కిలోలు) రూ.950 ఉండగా.. ఈసారి రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు. దీంతో పత్తి రైతులపై అదనపు భారం పడుతుంది. అలాగే వరి విత్తనాలపై సబ్సిడీకి సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అనంతరం సబ్సిడీపై ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎండలు ఉన్నందున పత్తి విత్తనాలను పొడి దుక్కుల్లో వేయవద్దని వ్యవసాయశాఖ సూచిస్తుంది.
నకిలీ విత్తనాలపై నిఘా..
గతంలో నకిలీ విత్తనాలు లభించడంతోపాటు అక్రమార్కులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా నకిలీ విత్తనాలపై పటిష్ట నిఘా ఉంచాలని అధికారులు నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ సహకారంతో వ్యవసాయ శాఖ సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ప్రముఖ విత్తన కంపెనీల లేబుళ్లను పాకెట్లపై ముద్రించి సగానికి సగం ధర తగ్గించి విక్రయించడం.. అదే ధరకు ఇవ్వడం చేస్తున్నారు. డబ్బు ఆలస్యంగా ఇచ్చినా తీసుకుంటామని చెప్పి కొంతమంది దళారులు రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంటగట్టిన సంఘటనలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు వ్యవసాయశాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. సీజన్‌కు ముందే 20,111 మెట్రిక్ టన్నుల యూరియాను సిద్ధంగా ఉంచారు.
జిల్లాలో ఆరు బృందాలతో విస్తృత తనిఖీలు
పత్తి, వరి,ఇతర విత్తనాల శాంపిళ్ల సేకరణ
ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రత్యేక ప్రణాళిక
నాణ్యత తేలాకే కంపెనీలకు అనుమతులు
విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తిస్థాయి అనుమతులు ఉన్న డీలర్లు, వ్యాపారుల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి రశీదులు తీసుకోవాలి. ఇటీవల విత్తన నమూనాలు సేకరించాం. నాణ్యత ఉన్న విత్తనాలకు మాత్రమే అనుమతిస్తున్నాం. దళారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనవద్దు. నకిలీ విత్తనాలు ఉన్నట్లు, లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

విత్తన నాణ్యతపై నజర్