
అమరచింత: మొదటి భార్యతో కలిసి రెండో భార్యను చిత్రహింసలకు గురిచేయడంతో భరించలేని ఆమె పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మండలంలోని కొంకన్‌వానిపల్లిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా.. గ్రామానికి చెందిన కుర్వ మంగనారాయణ, ఇందిరమ్మలకు పెళ్లి జరిగి 12 ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. దీంతో చిన్నచింతకుంటకు చెందిన కుర్వ స్వాతి అలియాస్ పద్మ(36)ను నారాయణ పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి శివ, లావణ్య సంతానం కలిగారు. శివ ప్రస్తుతం ఆరో తరగతి తుఫ్రాన్‌లోని గురుకులంలో చదువుతుండగా.. లావణ్య ఐదో తరగతి చదువుతుంది.
అయితే పిల్లలు పుట్టి పెరుగుతుండటంతో రెండో భార్య పద్మను ఇంటి నుంచి పంపించాలని భర్త నారాయణ, మొదటి భార్య ఇందిరమ్మ తరచూగా పద్మతో గొడవ పెట్టుకుని చిత్రహింసలకు గురిచేసేవారు. ఈ క్రమంలోనే గత నెల తమ వ్యవసాయ పొలంలో పద్మను నారాయణ, ఇందిరమ్మ చెట్టుకు కట్టి కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం పద్మను చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా నోట్లో పురుగు మందు తాగించారని సోదరులు శివ, రాజు వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పద్మను ఆస్పత్రిలో చేర్పించిన విషయాన్ని సైతం పద్మ కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచగా.. మృతిచెందడంతో తమకు తెలిసిందని వాపోయారు.
తమ అక్క చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో గ్రామంలో నారాయణ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి.. పద్మ పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.75 వేల కట్నంతోపాటు రెండున్నర తూలాల బంగారం తిరిగి ఇవ్వాలని తీర్మానం చేశారు. నారాయణను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు.