
సోమశిల సమీపంలోని అటవీ ప్రాంతంలోకెమెరాను అమరుస్తున్న అటవీశాఖ అధికారులు
కొల్లాపూర్: సోమశిల పరిసర ప్రాంతాల్లో నల్లమల అడవిలో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులను నమ్మొద్దని కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ శరత్‌చంద్రారెడ్డి తెలిపారు. మార్చి 6వ తేదీన ఏపీలోని నంద్యాల జిల్లా పెద్దగుమ్మదాపురంలో నాలుగు పులిపిల్లలు దొరికిన సంగతి తెలిసిందే. వాటి తల్లి పిల్లల కోసం సంచరిస్తూ కృష్ణానది దాటి సోమశిల ప్రాంతంలోకి వచ్చిందనే ప్రచారంపై రేంజర్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కృష్ణానది దాటి తెలంగాణ ప్రాంతంలోకి పులి వచ్చి ఉంటుందనేది అనుమానాలు మాత్రమేనని, పులి ఇటువైపుగా వచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. పులి వచ్చినట్లు ప్రచారం ఉండడంతో నల్లమల అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా రికార్డింగ్‌లను పరిశీలించినట్లు తెలిపారు. ఎక్కడా పులి జాడలు కనిపించలేదని తెలిపారు. సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏటీఆర్ బయాలజిస్టు మహేందర్ సాయంతో మొత్తం 10 ప్రాంతాల్లో కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో, నల్లమల పరిసర ప్రాంతాల్లో పులిజాడలు గమనిస్తే తమకు సమాచారం తెలియజేయాలని, అనుమతి లేకుండా ఎవరూ అడవిలోకి ప్రవేశించరాదని ఆయన సూచించారు.