రాగి చెంబుతో రూ.కోట్లు వస్తాయని నమ్మించి..

- - Sakshi

మిడ్జిల్‌: రాగి చెంబుతో రూ.కోట్లు సంపాదించవచ్చని నమ్మించి మోసం చేసిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మల్లాపూర్‌ చెందిన ముక్తాల వివేకానందగౌడ్‌, రంగారెడ్డి జిల్లాకు చెందిన నరేష్‌, మిథునం శేఖర్‌రెడ్డి, వెలిజర్ల మహేష్‌ కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. ఇబ్రహీంపట్నం యాచారం చెందిన జంగయ్య, మహేష్‌కు ఆరేళ్ల నుంచి పరిచయం ఉంది.

జంగయ్యకు హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ సంస్థలో పనిచేస్తున్న కర్నూల్‌ జిల్లా ఆత్మరూర్‌కు చెందిన రంగస్వామితో పరిచయం ఏర్పడింది. ఇందులో భాగంగానే మహేష్‌, రంగస్వామి తాను ఉన్నత స్థానంలో ఉన్నానని రాగిచెంబును రేడియేషన్‌ ద్వారా కెమికల్‌ చేసి, డీఆర్‌డీఎల్‌, ఇతర శాటిలైట్‌ కంపెనీలలో విక్రయిస్తే రూ.కోట్లలో డబ్బులు వస్తాయని చెప్పాడు. తన వద్ద రూ.2వేలకోట్ల కరెన్సీ ఉందని వీడియో కాల్‌ చేసి చూపించాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన జంగయ్య, వెలిజర్లకు చెందిన మహేష్‌ నుంచి 8నెలల క్రితం రూ.20లక్షలు తీసుకుని డబ్బులు రెట్టింపు అవుతాయని తెలిపాడు.

ఆ తర్వాత మల్లాపూర్‌కు చెందిన వివేకానందగౌడ్‌ నుంచి విడతల వారీగా రూ.16 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు గోదాం నుంచి మార్చడానికి కారు అవసరమని తీసుకుని వెళ్లి, తిరిగి రాలేదు. దీంతో వివేకానందగౌడ్‌ మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ రామ్‌లాల్‌నాయక్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top