తప్పులనొప్పుకోం..
మున్సిపల్ ఓటరు జాబితాపై రాజకీయ పక్షాల నిరసన
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు రూపొందించిన ఓటరు జాబితాపై జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు ముసాయిదా జాబితాను మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ప్రకటించారు. అయితే ఇందులో తప్పులు ఉన్నాయని జిల్లాలోని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఇతర పార్టీల నాయకులు అభ్యంతరం తెలిపారు. జాబితా సవరిస్తేనే ఎన్నికలకు సహకరిస్తామని నాయకులు తేల్చి చెప్పారు.
జాబితాలోని తప్పులు ఇలా..
● మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఇక్కడ నివాసం ఉండేవారి పేర్లు కాకుండా నర్సింహులపేట మండలం పెద్దనాగారం, కేసముద్రం మండలంలోని పలుగ్రామాలు, వేమునూరు, కంబాలపల్లితోపాటు పలు గ్రామాల ప్రజల పే ఓటరు జాబితాలో ఉన్నాయి.
● మహబూబాబాద్ పట్టణంలోని 22వ వార్డుల్లో ఇతర వార్డుల్లో నివాసం ఉండే 500 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి
● మహబూబాబాద్‌లోని 23వ వార్డుల్లో ఇతర వార్డుల్లో నివాసం ఉండే 400 ఓట్లు కలిశాయి.
● మహబూబాబాద్ పట్టణంలోని 34వ వార్డులో గతంలో ఉన్న ఓట్లకు 280 ఓట్లు కోత పెట్టి వాటిని ఇతర వార్డుల్లో కలిపారు.
● మహబూబాబాద్ పట్టణంలోని 36 వార్డుల్లో అన్ని వార్డులకు చెందిన ఓటర్లు కలిశాయని రాజకీయ నాయకులు చెబుతున్నారు.
● కొన్ని వార్డుల్లో ఒకే ఇంటి నంబర్‌పై 50 నుంచి 150 ఓట్లు నమోదు కావడం గమనార్హం.
● గుమ్ముడూరు ప్రాంతం 29వ వార్డుల్లో 2020 నాటి ఓట్లు కాకుండా ఇప్పుడు పట్టణానికి మరోవైపు ఉండే 24వ వార్డు ప్రాంతానికి చెందిన సుమారు 400 ఓట్లు చేరాయి. దీంతో ఇరు ప్రాంతాల్లో ఒకే కౌన్సిలర్ ఎలా అభివృద్ధి చేస్తారు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని రాజకీయ నాయకులు ప్రశ్నించారు.
రాజకీయ పార్టీల సూచనలు ఇలా..
● 2020లో మహబూబాబాద్ పట్టణంతోపాటు విలీన పంచాయతీలు శనిగపురం, జమాండ్లపల్లి, ఈదులపూసపల్లి, బేతోలు, గాంధీపురం, అనంతారం, రజాల్‌పేట, ముత్యాలమ్మగూడెం మొదలైన గ్రామాల ఓటర్లను బౌగోళిక స్థితి ఆధారంగా వార్డులుగా విభజించారు. ఇందుకు అనుగుణంగా ఓటరు జాబితాను తయారు చేశారు. ఇప్పుడు అదే విధంగా జాబితా తయారు చేయాలి.
● చాలా ఇంటి నంబర్లలో బై నంబర్లు తప్పులుగా వేసి ఓటరు జాబితాను తయారు చేశారు. ఇలా కాకుండా అనుభవం ఉన్న ఉద్యోగుల పర్యవేక్షణలో పునర్ పరిశీలన చేసిన తర్వాతనే కొత్త జాబితాను రూపొందించాలి
● పాత జాబితాలో స్పష్టతవచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన ఓటర్లు, చేర్పుల మార్పులకు అవకాశం ఇవ్వాలి.
● ఈ ప్రక్రియ అంతా 8వ తేదీ వరకు పూర్తి చేసి 9వ తేదీన అన్ని రాజకీయ పార్టీలకు కాఫీ ఇవ్వాలి. అందరూ అంగీకరించిన తర్వాతనే 10వ తేదీ తుది జాబితాను ప్రకటించాలి.
సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేసిన సూచనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి తుది జాబితాను తయారు చేసి ఇస్తామని ప్రకటించినట్లు ఆయా పార్టీల నాయకులు ‘సాక్షి’తో తెలిపారు.
వార్డులతో పొంతన లేకుండా జాబితా
సవరణ చేస్తేనే సహకరిస్తామన్న రాజకీయ పార్టీల నాయకులు
తుది జాబితాకు ముందు సమావేశం నిర్వహించాలని డిమాండ్
రాజకీయ పార్టీల అభిప్రాయాలపై కలెక్టర్ సానుకూల స్పందన
ఓటర్లు వార్డు పరిధిలో ఉండేలా చూడాలి
మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని వివిధ పార్టీల నాయకులు అజయ్‌సారఽథిరెడ్డి, సురేష్‌నాయుడు, సూర్నపు సోమయ్య, వెంకన్న, శ్యాంసుందర్‌శర్మ, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక వార్డు ఓటర్ల పేర్లు మరో వార్డులో ఉన్నాయని.. సరిచేయాలని కోరారు. నాయకులు ఖలీల్, కుమార్, ఫరీద్, రాజమౌళి, రామారావు, సందీప్, వెంకన్న, సీతారాం నాయక్, యాకయ్య పాల్గొన్నారు.
తప్పులనొప్పుకోం..
తప్పులనొప్పుకోం..


