పంటల నమోదులో అధికారుల నిర్లక్ష్యం
● మొక్కజొన్న, పత్తి
విక్రయించేందుకు ఇబ్బందులు
● ప్రభుత్వ శాఖల మధ్య
కొరవడిన సమన్వయం
● గత్యంతరం లేక ప్రైవేట్‌లో
ఉత్పత్తులను అమ్ముకుంటున్న రైతులు
పంటల ధరల వివరాలు(క్వింటా)
పంట ప్రభుత్వ ధర ప్రైవేట్‌లో
కొనుగోళ్లు
ధాన్యం రూ. 2,369 రూ. 2,000
పత్తి రూ. 8,110 రూ. 7,000 మొక్కజొన్న రూ. 2,400 రూ. 1,800
సాక్షి, మహబూబాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒక వైపు కృషి చేస్తుంటే.. మరోవైపు మాత్రం పంటల నమోదులో పేర్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధరకు ఉత్పత్తులు అమ్ముకునేందుకు మార్కెట్‌కు వస్తే ప్రభుత్వ రికార్డుల్లో పంటలు నమోదు కాలేదని చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో చేసేది ఏమీ లేక పంటలను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
రైతులు, దళారుల తేడా తెలుసుకోవడం, నిజమైన రైతులకు ఎరువులు అందించడం, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందించాలంటే రైతుల వారీగా వారు సాగుచేసిన పంటలను నమోదు చేయాలి. ఇలా చేస్తేనే ప్రైవేట్ వ్యాపారులు, దళారుల మోసాలు అరికట్టవచ్చని ప్రభుత్వం భావించింది. కాగా, కొన్నిచోట్ల వ్యవసాయశాఖ అధికారులు రైతుల పంట క్షేత్రాల వద్దకు వెళ్లి పంటల సాగు నమోదు చేయకుండా.. ఆఫీసులు, ఫర్టిలైజర్ షాపుల్లో కూర్చొని నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలను 2,44,449 మంది రైతులు 4,24,000 ఎకరాల్లో సాగు చేసినట్లు అంచనా. అయితే వ్యవసాయశాఖ అంచనాలు తారుమారయ్యాయి. 85వేల ఎకరాల పత్తి సాగు కాస్త 91,219 ఎకరాలకు, 60వేల ఎకరాలు సాగుచేస్తారని భావించిన మొక్కజొన్న 67 వేల ఎకరాలకు చేరింది. 2,21,000 ఎకరాల్లో సాగు చేస్తారని భావించిన వరి 2,04,653 ఎకరాలకు తగ్గింది. ఈ పంటల లెక్కలు కూడా సక్రమంగా చేయకపోవడం, కంప్యూటర్లలో తప్పులు నమోదు చేయడంతో రైతుల పేర్లు గల్లంతు అయ్యాయి.
సమన్వయ లోపం..
రైతులు సాగు చేసిన పంటల వివరాలు వ్యవసాయశాఖ వద్ద ఉంటాయి. ఆ వివరాలు పత్తి కొనుగోలు చేసే సీసీఐ, మక్కల కొనుగోలు చేసే మార్క్‌ఫెడ్, ధాన్యం కొనుగోలు చేసే సివిల్‌సప్లయీస్ శాఖలకు తెలియాలి. వ్యవసాయశాఖ కమిషన్ కార్యాలయం నుంచి పంటల వారీగా వివరాలు తెప్పించుకోవాలి. ఆ వివరాలను పత్తి కొనుగోలు కోసం కపాస్ కిసాన్ యాప్, మక్కల ఇతర సరుకుల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్, సివిల్‌సప్లయీస్ రికార్డుల్లో నమోదు చేయాలి. కానీ, సమన్వయలోపంతో వ్యవసాయశాఖ వద్ద ఉన్న వివరాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే శాఖలు తెప్పించుకోలేదని ప్రచారం. దీంతో కొందరు రైతుల పేర్లు మాత్రమే ఆన్‌లైన్‌లో చూపిస్తున్నాయని, మిగిలిన వారి పేర్లు లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్, సీసీఐ, సివిల్‌సప్లయీస్ అధికారులు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతల తిప్పలు
అన్నదాతల తిప్పలు
అన్నదాతల తిప్పలు


