తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గం కొనసాగింపు
హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం
తొర్రూరు: తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తూ జిల్లా సహకార శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం డీసీఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రద్దు చేసిన పీఏసీఎస్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు కొనసాగనున్నారు. రుణాల రికవరీలో నిర్లక్ష్యం, డైరెక్టర్లు రుణాలు తీసుకుని చెల్లించకపోవడం, ధాన్యం తరలింపు, గన్నీ సంచుల కొనుగోళ్లలో అవకతవకలు, వార్షిక బడ్జెట్ రూపకల్పనలో తీవ్ర నిర్లక్ష్యం నేపథ్యంలో తొర్రూరు సొసైటీ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జిల్లా సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ హై కోర్టును ఆశ్రయించడంతో కేసును క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. మళ్లీ ఎన్నిక జరిగే వరకు కమిటీ తాత్కాలికంగా కొనసాగనుంది.
ఏసీబీ తనిఖీల భయం
మహబూబాబాద్ రూరల్: అవినీతి నిరోధక శాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలకు వస్తున్నారనే సమాచారం బుధవారం స్థానికంగా కలకలం రేపింది. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఇతర పలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు జరగనున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తం కావడంతోపాటు జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో దస్తావేజు లేఖ రులు, రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను భయం భయంగా కొనసాగించారు. సాయంత్రం కాగానే పలువురు తమ సంస్థలకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
హాజరుశాతం
పక్కాగా ఉండాలి
కురవి: ఉపాధ్యాయులు, విద్యార్థుల హజరుశాతం పక్కాగా ఉండాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గుగులోత్ దేశీరాంనాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని స్టోర్ గది, కిచెన్‌షెడ్, డైనింగ్‌హాల్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ప్రార్థనలో పిల్లలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శీతాకాలం నేపథ్యంలో పిల్లలకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి మానసిక, ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రతీ సబ్జెక్టులో మెళకువలు నేర్పిస్తూ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్‌పై పిల్లలకు అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓ సునీత పాల్గొన్నారు.
తొర్రూరు పీఏసీఎస్ పాలకవర్గం కొనసాగింపు


