వయోవృద్ధుల ఎదురుచూపు
మహబూబాబాద్: వయోవృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ మంజూరు చేసింది. అయితే సెంటర్ ఏర్పాటులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. దానికి కేటాయించిన గది మరమ్మతు పనులు పూర్తి కాలేదు.. కేవలం ఎస్టిమేషన్ దశలోనే ఉంది. నిర్వాహకుడి ఎంపిక కూడా పూర్తి కాలేదు. సెంటర్ మంజూరుపై వయోవృద్ధుల హర్షం వ్యక్తం చేసినప్పటికీ నేటికీ ఏర్పాటు చేయకపోవడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సెంటర్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఏంఈఓ కార్యాలయంలో..
మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఏర్పాటు కోసం ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. కాగా ఎంఈఓ కార్యాలయంలోని ఓ గదిలో సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ భవనంలోని పుస్తకాలు భద్రపర్చే గదిని కేటాయించగా.. దాని మరమ్మతుల కోసం పీఆర్ ఏఈ ద్వారా ఎస్టిమేషన్ వేయించారు. రంగులు, మరమ్మతులు, ఇతర వాటి కోసం కలెక్టర్ తన నిధుల నుంచి డబ్బులు కేటాయిస్తారని అధికారులు పేర్కొన్నారు.
కాలక్షేపం కోసం..
జిల్లాలో 60ఏళ్లు దాటిన వయోవృద్ధుల కాలక్షేపం కోసం జిల్లాకు కేటాయించిన సెంటర్‌లో క్యారంబోర్డు, చెస్, న్యూస్ పేపర్లు, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు సెంటర్ తెరిచి ఉంటుంది. అలాగే వయోవృద్ధులకు స్నాక్స్ ఇస్తారు. వారంలో ఒక రోజు వైద్యుడు వచ్చి వయోవృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తుల స్వీకరణ పూర్తి..
సెంటర్ నిర్వహణ బాధ్యతలు ఎన్జీఓ (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్) సీనియర్ సిటిజన్‌లకు అప్పగించనున్నారు. అందుకు ఈఏడాది సెప్టెంబర్ 23నుంచి 25 వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చింది. ఈమేరకు ఐదుగురు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా డీఆర్‌డీఏ, డీఎంహెచ్‌ఓ, ఒక సీనియర్ సిటిజన్, కన్వీనర్‌గా డీడబ్ల్యూఓ ఉంటారు. కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది.
మల్టీ సర్వీస్ కేర్ సెంటర్ ఏర్పాటులో జాప్యం
ఎంఈఓ కార్యాలయ భవనంలో గది కేటాయింపు
మరమ్మతుల దృష్ట్యా ఎస్టిమేషన్ పూర్తి
ప్రారంభం కాని పనులు
నేటికీ నిర్వాహకుడి ఎంపికలో తాత్సారం
అందుబాటులోకి రాని గది..
ఈఏడాది సెప్టెంబర్‌లో ఎంఈఓ కార్యాలయ భవనంలోని ఓ గదిలో సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ నేటి వరకు గది మరమ్మతులు పూర్తి కాలేదు. కేవలం ఎస్టిమేషన్ దశలోనే ఉంది. మరమ్మతు పనులు ఎప్పుడు పూర్తవుతాయి.. ఎప్పుడు ఏర్పాట్లు జరుగుతాయని వయోవృద్ధులు ఎదురుచూస్తున్నారు. ప్రక్రియ మొదలు పెట్టి రెండు నెలలు గడుస్తున్నా సెంటర్ ఏర్పాటులో పురోగతి కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


