చీర, సారె పెట్టడం తెలంగాణ సంప్రదాయం
● వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్: ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపడుతున్నామని, ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం తెలంగాణ సంప్రదాయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు, వాటికి యజమానులను చేశామన్నారు. పాఠశాలల యూనిఫాం కుట్టు బాధ్యతలు మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్‌కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


