పార్కు పనులకు పాతర..
కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
మహబూబాబాద్: జిల్లా కేంద్రం శివారులో దాశరథి స్మృతివనం నిర్మాణ పనులు చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. కోర్టు కేసుల నేపథ్యంలో కొన్ని సంవత్సరాల క్రితం పనులు నిలిపారు. దీంతో ఆ ప్రాంతం అంతా చెట్లు ఏపుగా పెరిగి అడవిలా మారింది. అనుకూల ప్రదేశంలో చేపట్టినా పలు కారణాలతో పనులు నిలవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధులున్నా కేవలం కేసుల పేరుతో కాలయాపన చేస్తున్నారని, సంబంధిత అధికారులు శ్రద్ధ వహిస్తే ఆ స్మృతివనం పూర్తవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
ఆరు ఎకరాలు కేటాయింపు..
మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు అనంతారం రోడ్డులో స్మృతివనం ఏర్పాటు కోసం ఆరు ఎకరాల భూమి కేటాయించారు. ఆ రోడ్డులోనే మున్సిపాలిటీ కార్యాలయం భవనం నిర్మాణం చేస్తున్నారు. ఆ స్మృతి వనానికి దాశరథి స్మృతి వనంగా నామకరణం చేశారు. అప్పటి కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా ప్రత్యేక చొరవ తీసుకుని పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ తన క్రూషల్ బ్యాలెన్సింగ్ ఫండ్ నుంచి రూ 27.50 లక్షలు కేటాయించారు. కాగా, ఐటీడీఏ ఆధ్వర్యంలో 2018 ఆగస్టులో పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ బేస్‌మెంట్, ప్రహరీ, ప్రధాన ద్వారం, ఇతరత్రా పనులు సగం వరకు పూర్తి చేశారు. ఆ పనులకు గాను రూ.13 లక్షల బిల్లులు చేసి కాంట్రాక్టర్‌కు ఇచ్చిన్నట్లు అధికారులు తెలిపారు.
పార్కుగా అభివృద్ధి చేయాలని..
స్మృతి వనంలో మూడు ఎకరాల్లో పార్క్ ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి ఆట సామగ్రి సమకూర్చాలని భావించారు. అలాగే, మహనీయుల విగ్రహలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దాలనుకున్నారు. మిగతా మూడు ఎకరాల్లో ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అక్కడ మొక్క నాటి సంరక్షించడంతోపాటు ప్రతీ సంవత్సరం ఆ మొక్క వద్ద కార్యక్రమాలు చేసుకోవచ్చు. వారికి గుర్తుగా దాని చుట్టూ పలు నిర్మాణాలు చేసుకోవచ్చు. ఆ విధంగా ప్లాన్ చేశారు.
అందుబాటు లేని ప్రాంతంలో అర్బన్ పార్కు..
అటవీ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆరు కిలోమీటర్ల దూరంలో జమాండ్ల పల్లి శివారులో అర్బన్ పార్కు నిర్మాణం చేశారు. దూరంగా ఉండడంతో అక్కడికి వెళ్లడానికి పట్టణ వాసులు పెద్దగా ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో స్మృతివనం నిర్మాణం పూర్తయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. మున్సిపాలిటీ కార్యాలయం వెళ్లే వారికి , ఆ రోడ్డులోనే మోడల్ కళాశాల ఉంది. పలు కాలనీలు కూడా ఉన్నాయి.
ప్రస్తుత కలెక్టర్ అౖద్వైత్‌కుమార్ సింగ్ ఆ స్మృతి వనంపై దృష్టి సారిస్తేనే తిరిగి పనులు ప్రారంభమవుతాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఆ నిధులు కూడా ల్యాప్స్ అయ్యాయా లేదా అనే విషయాలు కలెక్టర్ పరిధిలో ఉంటాయని, అందుకే ఆ సమస్య పరిష్కారం కలెక్టర్‌తోనే సాధ్యమని సంబంధిత అధికారులు అంటున్నారు. ఏదిఏమైనా దాశరథి స్మృతి వనం పనులు పూర్తయితే జిల్లా కేంద్రంలో అతి పెద్ద పార్కు అందుబాటులోకి వచ్చి ఆహ్లాదం పంచుతుందని ప్రజలు భావిస్తున్నారు.
నిలిచిన దాశరథి స్మృతివనం నిర్మాణం
ఏడు సంవత్సరాలు పూర్తి కావొస్తున్న పట్టించుకోని అధికారులు
నిధులున్నా కోర్టు కేసు పేరుతో
కాలయాపన
ఫలితంగా అడవిగా మారిన స్మృతివనం
కోర్టు కేసులతో..
స్మృతి వనం నిర్మాణం ప్రారంభించిన భూమి తదేనని కోంత మందికోర్టుకు వెళ్లారు. ఫలితంగా పనులు నిలిచాయి. దీంతో చేపట్టిన నిర్మాణాలు ప్రస్తుతం దెబ్బతింటున్నాయి. ఆ ప్రాంతం అంతా పిచ్చి మొక్కలు వృక్షాలు పెరిగి అడవిని తలపిస్తోంది. సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించడం లేదు. కేసుల పేరుతో స్మృతి వనం నిర్మాణాన్ని విస్మరించారు.


