గిరిజన విజ్ఞానపీఠం పరిశోధనలు అమూల్యం
హన్మకొండ కల్చరల్: జానపద గిరిజన విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో చేసిన పరిశోధనలు అమూల్య మని, సమాజం, విద్యార్థులకు విలువైన సమాచారం అందించేలా పీఠం చేస్తున్న కృషి అభినందనీయమని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ వెలుదండ నిత్యానందరావు అన్నారు. ఈ మేరకు వరంగల్ హంటర్‌రోడ్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గత అక్టోబర్‌లో వచ్చిన వరదతో నీటిలో మునిగిన పీఠంలోని మ్యూజియాన్ని పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బంది సేకరించిన విలువైన పురాతన వస్తువులు, కళాఖండాలు వరదతో పాడైపోవడం బాధాకరమని, మ్యూజియానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక నిర్మాణం చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. పీఠం అభివృద్ధికి సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేశ్, చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్‌రెడ్డి, నోముల రాజు, సునీత, టెక్నికల్ అసిస్టెంట్ గంపా సతీశ్, సిబ్బంది సునంద, ఆంజనేయులు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఒద్దిరాజు సోదరుల కృషి అమోఘం
స్వాతంత్య్రోద్యమం, సాహిత్య రంగంలో ఒద్దిరాజు సోదరుల కృషి అమోఘమని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ వెలుదండ నిత్యానందరావు అన్నారు. శనివారం సాయంత్రం హనుమకొండ వడ్డేపల్లిరోడ్‌లోని పీఆర్‌రెడ్డి భవన్‌లో సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 29వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒద్దిరాజు సోదరుల స్మృత్యకంగా ‘ముంబై చూపుతో తెలుగు కథానికలు’ అనే కథాసంకలనానికి ముంబాయికి చెందిన రచయిత అంబల్ల జనార్దన్‌కు పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి వీసీ నిత్యానందరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, పెద్దింటి అశోక్‌కుమార్, తులసీమురళీకృష్ణ, సహృదయ ప్రధాన కార్యదర్శి కుందావర్జుల కృష్ణమూర్తి, సాహిత్య కార్యదర్శి మల్యాల మనోహరరావు, ఎన్వీఎన్ చారి, ఒద్దిరాజు సోదరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం
వీసీ నిత్యానందరావు


