పల్టీకొట్టిన కంప్రెషర్ ట్రాక్టర్
కేసముద్రం: కంప్రెషర్ ట్రాక్టర్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి శివారులోని ఓ క్వారీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని ఓ క్వారీలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు గ్రామానికి చెందిన గుంజ రాములు(53) కంప్రెషర్ నడుపుతున్నాడు. శనివారం క్వారీలోకి కంప్రెషర్ ట్రాక్టర్‌ను వెనక్కి తీసుకెళ్తుండగా బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. దీంతో పది ఫీట్ల ఎత్తునుంచి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
బైక్, లారీ ఢీ..
●వ్యక్తి మృతి..పంతులు తండా వద్ద ఘటన
దంతాలపల్లి : బైక్, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామ శివారు పంతులు తండా వద్ద ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన పస్తం వీరస్వామి (58) గ్రామాల్లో చెట్ల ములికలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ములికలు విక్రయించేందుకు ఇంటి నుంచి బయలుదేరి మరిపెడ బంగ్లాలో ఉంటూ సమీప గ్రామాల్లో విక్రయిస్తున్నాడు. ఇందులో భాగంగా దంతాలపల్లి ఏరియాలో ములికలు విక్రయించి ప్రస్తుతం తాను ఉంటున్న బంగ్లాకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పంతులు తండా వద్ద ఖమ్మం నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో వీరస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
● డ్రైవర్ అక్కడికక్కడే మృతి
● మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లావాసి
పల్టీకొట్టిన కంప్రెషర్ ట్రాక్టర్


