వికటించిన నకిలీ వైద్యుల ఆపరేషన్
● ఎంజీఎంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువకుడు
ఎంజీఎం: నకిలీ వైద్యుల ఆపరేషన్ వికటించి ఓ యువకుడు ఎంజీఎంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండకు చెందిన యువకుడు మాడూరు రజనీకాంత్ అర్ష మొలల (పైల్స్) సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్యపై నర్సంపేట సమీపం మంగళవారిపేట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీలుగా చలామణి అవుతున్న కౌసల్య, చిట్టిబాబును సంప్రదించారు. దీంతో వారు ఈనెల 13వ తేదీన రజనీకాంత్‌కు ఆపరేషన్ చేయగా అదే రోజు రాత్రి తీవ్ర రక్త స్రావం(హైపో వోలెమిక్ షాక్) అయ్యింది. దీంతో అదే రోజు రాత్రి 11గంటలకు ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎంలో చేరాడు. ఇక్కడ జనరల్ సర్జన్ నాగేందర్ నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రూప, కార్తీక్, పీజీ వైద్యుడు శరణ్ మరో ఆపరేషన్ నిర్వహించి రక్తస్రావాన్ని నియంత్రించారు. ఇప్పటికీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై భాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషనన్స్ కమిటీ చైర్మన్ నరేశ్ కుమార్, జిల్లా యాంటీ క్వాకరీ కమిటీ సభ్యుడు దిలీప్‌కుమార్ బాధితుడిని గురువారం పరామర్శించి ఘటన వివరాలు సేకరించినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. వైద్య పరంగా అర్హత లేని వ్యక్తులు, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్(ఆర్‌ఎంపీ)లు వైద్యులు కారని, వీరు చేసే ఆశాసీ్త్రయ చికిత్సతో సమస్య మరింత జఠిలమతుందని కౌన్సిల్ సభ్యులు తెలిపారు. క్వాలిఫైడ్ వైద్యులు, ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలని పేర్కొన్నారు. మంగళవారిపేటలో నకిలీ వైద్యులు కౌసల్య, చిట్టిబాబుపై విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామని కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు.


