సమాజ సేవ.. ఎన్‌ఎస్‌ఎస్ తోవ!
తొర్రూరు: సమాజ సేవలో భాగస్వాములవుతూ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలతో గ్రామాల్లో ప్రజలను జాగృతం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఓటు ప్రాధాన్యం, మద్యపాన నిర్మూలన వంటి అంశాల్లో గ్రామీణులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏడు రోజుల పాటు శిబిరం నిర్వహించి విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందిస్తున్నారు. తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, కొత్తగూడెం ప్రభుత్వ జూని యర్ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఏడు రోజుల పాటు క్యాంపులో పాల్గొని పల్లె వాసుల్లో స్పూర్తిని నింపారు. మహబూబాబాద్ గిరిజన సంక్షేమ బాలికల గురుకులం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో తొర్రూరులో క్యాంపు కొనసాగుతోంది.
కదులుతూ.. కదిలిస్తూ..
జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఎన్‌ఎస్‌ఎస్ కేయూ కో ఆర్డినేటర్ ఈసం నారాయణ, జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏడు రోజుల శిబిరం విజయవంతంగా నిర్వహించారు.
● బహిరంగ మలమూత్రవిసర్జన నిర్మూలించి మరుగుదొడ్లు నిర్మించుకునేలా స్థానికులకు అవగాహన కల్పించారు.
● గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రపరిచి పరిసరాల శుభ్రతపై స్థానికులను చైతన్యపరిచారు.
● వయోజన విద్య, అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేశారు.
● పర్యావరణ విశిష్టతను తెలియజేస్తూ గ్రామాల్లో మొక్కలు నాటుతున్నారు.
● గ్రామీణ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
● వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేయడంతో పాటు శ్రామికుల శ్రమ శక్తి విలువ ప్రాధాన్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు.
● విద్య ప్రాముఖ్యం. మద్యపాన నిర్మూలన, అనర్థాలు, పోలియో నిర్మూలనపై అవగాహన కల్పించారు.
● ప్రభుత్వ పథకాల ప్రయోజనంపై సమావేశాలు నిర్వహించారు.
● డ్రైవర్స్ డే సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.
● బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు.
● డ్రగ్స్ వినియోగంతో తలెత్తే పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.
శిబిరాలతో విద్యార్థుల్లో ఉత్సాహం
గ్రామాల్లో ఆయా అంశాలపై
అవగాహన
జిల్లాలో ఆదర్శంగా ఎన్‌ఎస్‌ఎస్
కార్యక్రమాలు


