సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలి
● మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్
మహబూబాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ వ్యాపారులను కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను వాడొద్దన్నారు. జూట్ బ్యాగులు వినియోగించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జరిమానాలు విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, వ్యాపారులు పాల్గొన్నారు.


