
అత్తను కడతేర్చిన అల్లుడి అరెస్ట్
ఏటూరునాగారం : మద్యానికి బానిసై మేనత్తను హత్యచేసిన అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం వీఆర్‌కేపురం–ఇప్పలగూడెం ప్రాంతానికి చెందిన కొండగొర్ల ఎల్లమ్మను బుధవారం ఆమె మేనల్లుడు విజయ్‌కుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై వెంకటాపురం(కె) పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా విజయ్‌కుమార్ తండ్రి చిన్నతనంలో మరణించగా ఎలాంటి పని చేయకుండా మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో అతడి మేనత్త ఎల్లమ్మ భర్తతో విడిపోయి తల్లిగారి ఇంటి వద్దనే ఉంటోంది. దీంతో ఆమె వద్దనుంచి విజయ్‌కుమార్ తరుచూ డబ్బులు తీసుకొని జల్సాలు చేసేవాడు. బుధవారం కూడా డబ్బు, బంగారం ఇవ్వాలని ఎల్లమ్మ ను అడడగా ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న విజయ్‌కుమార్ కోపోద్రికుడై గొడ్డలితో ఎల్లమ్మపై దాడి చేసి హత్య చేశాడని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ రమేష్, ఎస్సై తిరుపతిని ఏఎస్పీ అభినందిచారు.