
అభివృద్ధి చేస్తే పర్యాటక పురోగతి
జాలువారే జలపాతాలు.. నిషేధాలతో కనుమరుగుకానున్న అద్భుతాలు
వాజేడు: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (కె) మండలాల్లో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. అందులో బొగత జలపాతం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందగా మిగతా జలపాతాలు చిన్న చూపుకు గురవుతున్నారు. దీంతో వెలుగులోకి రావడం లేదు. నిర్మానుష్య అటవీ ప్రాంతం.. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, రక్షణ లేదనే కారణాలతో ఈ అద్భుత జలపాతాల సందర్శనను అధికారులు నిషేధించారు. ఫలితంగా ఆ జలపాతాల సందర్శనకు పర్యాటకులు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు దండకారణ్యంలోని కర్రె గుట్టలను కేంద్రం ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే సన్నద్ధమైనట్లు సమాచారం. కర్రె గుట్టలు ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రదేశాలను తలదన్నేలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్రె గుట్టలను పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. అక్కడే పెద్ద ఎత్తున పోలీస్ శిక్షణ కేంద్రం సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కర్రె గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే అదే సమయంలో ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో కరె గుట్టలను ఆనుకుని ఉన్నప్పటికీ పర్యాటకపరంగా నిషేధంలో ఉన్న అన్ని జలపాతాలు పూర్తి స్థాయిలో వెలుగు లోకి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా జలపాతాలు శరవేగంగా అభివృద్ధి సాధించనున్నాయి. ఈ క్రమంలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో ఉన్న జలపాతాల పేర్లు, వాటి వివరాలు, ప్రాముఖ్యతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.