
‘ఔటర్’ ప్రమాదం.. తీరని విషాదం
గూడూరు: ‘ఔటర్’ ప్రమాదం.. తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మానుకోట జిల్లా వాసుల దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం తోటదస్రుతండాకు చెందిన గుగులోత్ జనార్దన్ (50), మహబ్బి దంపతులకు కూతురు సునీత సంతానం. సునీత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. కాగా, కూతురు చదువు దృష్ట్యా జనార్ధన్, మహబ్బి దంపతులు రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జనార్దన్ మృతిచెందాడు. దీంతో తోటదస్రుతండాలో విషాదఛాయలు అలుముకున్నారు.
మరోఘటనలో..
కొత్తగూడ : మండలంలోని మాసంపెల్లి తండాకు చెందిన మాలోత్ చందూలాల్(28) హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. చందూలాల్‌కు ఎనిమిదేళ్ల క్రితం దేవితో వివాహం జరగగా కుటుంబ పోషణ నిమిత్తం కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్ల వారుజామున నిద్రమత్తులో ఓఆర్‌ఆర్‌పై లారీని ఢీకొన్నాడు. ఈ ఘటనలో చందూలాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఉపాధ్యాయుడిపై కేసు
హసన్‌పర్తి: ఫేక్ డాక్యుమెంట్‌తో ప్లాట్ విక్రయానికి కుదుర్చుకుని మోసం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని లష్కర్‌బజార్‌కు చెందిన సయ్యద్ మసూద్ షరీఫ్ వడ్డేపల్లి శివారులోని సర్వే నంబర్ 370లో వరంగల్ కేఎంసీ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు (ప్రస్తుతం మామునూరులోని పింఛన్‌పుర సబ్ జైల్ పాఠశాలలో) మజహర్ హుస్సేన్ వద్ద 201 చదరపు గజాల (ప్లాట్–38)కు రూ.44 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకుగాను జూన్‌లో రూ.9 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. మర్నాడు ప్లాట్ వద్దకు వెళ్లగా.. అక్కడ అగ్రిమెంట్‌లో పేర్కొన్న ప్లాటు కనిపించలేదు. ఈవిషయమై నిలదీయగా, జాప్యం చేస్తూ వచ్చాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరికి బాధితుడు సుబేదారి పోలీసులను ఆశ్రయించాడు.
● హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై
రోడ్డు ప్రమాదాలు
● ఇద్దరు మానుకోట జిల్లా వాసుల
దుర్మరణం
● శోకసంద్రంలో తోటదస్రుతండా, మాసంపెల్లి తండాలు

‘ఔటర్’ ప్రమాదం.. తీరని విషాదం