
కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
జనగామ: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని, ఆ నినాదమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమానికి దూరమైన ప్రజలు.. రేవంత్‌రెడ్డి చెప్పిన బూటకపు మాటలను నమ్మి మోసపోయారన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి పెనం నుంచి పొయ్యిలో పడ్డారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజాసమస్యలు, అభివృద్ధిని పక్కనపెట్టి పరస్పరం బూతులు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమని, ఆ నినాదంతోనే స్థానిక సంస్థల్లో ప్రచార హస్తంగా వినియోగించుకుని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 19 నెలల పాలనలో ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీలపై మీరు నిలదీయొద్దు, స్కాంల విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని మేం అరెస్ట్ చేయబోమంటూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీజేపీని గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి గుండె విజయరామారావు, పట్టణ అధ్యక్షుడు అనిల్‌గౌడ్, జిల్లా కన్వీనర్ ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర నాయకులు కేవీఎల్‌ఎన్‌రెడ్డి, బొజ్జపల్లి సుభాశ్, మహంకాళి హరిచంద్రగుప్తా, పెద్దోజు జగదీశ్ పాల్గొన్నారు.
ఆ నినాదమే ప్రజల్లోకి తీసుకెళ్లాలి
తెలంగాణ ప్రజలు పెనం నుంచి
పొయ్యిలో పడ్డారు
కేసీఆర్ స్కాంలకు కాంగ్రెస్ రక్షణ
స్థానిక సంస్థల సన్నద్ధం వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్