
పండుగపూట విషాదం..
ఖానాపురం: పండుగపూట విషాదం నెలకొంది. ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయిన బైక్.. పండుగ వేడుకలో భాగంగా రహదారి పక్కన నృత్యం చేస్తున్న వ్యక్తిని ఢీకొనగా అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖానాపురం మండలం ఐనపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో గురువారం తీజ్ పండుగ జరుపుకున్నారు. తీజ్ నిమజ్జనం సందర్భంగా గ్రామంలోని జాతీయ రహదారి పక్కన తండావాసులు రాత్రి నృత్యం చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని బుధరావుపేటకు చెందిన యువకుడు కోడి రాకేశ్ బైక్‌పై గ్రామానికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన డీసీఎం తప్పించబోయి పక్కనే పండగ వేడుకలో ఉన్న వాంకుడోతు ఈరు(45)ను ఢీకొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడితో ఆగకుండా బైక్ పక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఘటనలో గుగులోత్ రమేశ్, భూక్య బాలు, భూక్య మౌనిక, గుగులోత్ గాయత్రీకి తీవ్ర గాయాలు కాగా మరో పదిమందికి స్వల్పగాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు రాకేశ్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈరుతో పాటు మిగతా వారందరిని ఆస్పత్రికి తరలించగా ఈరు అప్పటికే మృతి చెందాడు. కాగా, నెక్కొండ మండలం దుబ్బతండాకు చెందిన ఈరు ఇరవై సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఐనపల్లికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య బుజ్జి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.
● బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
● పది మందికి పైగా గాయాలు
● ఐనపల్లిలో ఘటన