
పెరిగిన విద్యుత్ వినియోగం
హన్మకొండ: వర్షాభావ పరిస్థితులు, ఎండ తీవ్రత, సాగు పనులు ముమ్మరం కావడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవికి దీటుగా వినియోగదారులు విద్యుత్‌ను వాడుతున్నారు. ఫలితంగా వర్షాకాలంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. మే మాసంలో మురిపించిన వర్షాలు.. వానాకాలం సీజన్ మొదలు కాగానే ముఖం చాటేశాయి. దీంతో వాతావరణ పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. మరో వైపు వర్షాలు కురవకపోడంతో మెట్ట పంటలు వేసి.. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న రైతులు ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు తడులు పెడుతున్నారు. దీనికి తోడు రైతులు నాటు వేసేందుకు పొలాన్ని దున్నుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు తోడేందుకు మోటార్లు వాడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మొత్తంగా వేసవికి మించిన విద్యుత్ వినియోగం పెరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 16వ తేదీ వరకు 1059. 994 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించారు. గతేడాది ఇదే సమయానికి 953.069 మిలియన్ యూనిట్లు వాడారు. గతేడాదితో పోలిస్తే 106.925 మిలియన్ యూనిట్లు అదనంగా వినియోగించారు.
వర్షాభావ పరిస్థితులతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 22.060 మిలియన్ యూనిట్లు అధికంగా వినియోగించారు. జగిత్యాల సర్కిల్‌లో గతేడాది కంటే ప్రస్తుతం 12.777 మిలియన్ యూనిట్లు, ఖమ్మంలో గతేడాదికంటే ప్రస్తుతం 18.393 మిలియన్ యూనిట్లు, హనుమకొండ సర్కిల్‌లో గతేడాదితో పోలిస్తే 15.460 మిలియన్ యూనిట్లు అధికంగా, మంచిర్యాల సర్కిల్‌లో గతేడాదితో పోలిస్తే 8.053 మిలియన్ యూనిట్లు అధికంగా వినియోగించారు. కాగా, ఆదిలాబాద్, నిర్మల్‌లో గతేడాది కంటే తక్కువ వినియోగించారు. కామారెడ్డి సర్కిల్‌లో గతేడాదితో పోలిస్తే 1.926 మిలియన్ యూనిట్లు తక్కువ, నిర్మల్‌లో 1.148 మిలియన్ యూనిట్లు తక్కువ వినియోగించారు. ఇదిలా ఉండగా జూలై మాసంలో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 2న అతి తక్కువ 48,571 మిలియన్ యూనిట్లు వినియోగించగా ఈ నెల 16న అత్యధికంగా 85.294 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్ల బడింది. దీంతో ఈ నెల 2న అతి తక్కువ వినియోగం జరిగింది. గతేడాది జూలై 2న 55.352 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించగా ఈ నెల 2న 48.571 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించారు. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఈ నెల 16 వరకు అత్యధికంగా 85.294 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించారు. గతేడాది ఈ తేదీన 58.616 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగమైంది. 26.678 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది.
టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఈనెల 16వ తేదీ వరకు 1059.994 మిలియన్ యూనిట్లు
గతేడాది ఇదే సమయానికి 953.069 మిలియన్ యూనిట్లు..
ఎండల తీవ్రత, వర్షాభావ పరిస్థితుల ప్రభావమే కారణం
జూలై 1 నుంచి 16వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో విద్యుత్ వినియోగం వివరాలు (మిలియన్ యూనిట్లలో)
జిల్లా 2025 2024 తేడా (అదనపు వినియోగం)
హనుమకొండ 71.600 56.140 15.400
వరంగల్ 47.059 42.100 4.959
జనగామ 66.910 59.400 7.510
మహబూబాబాద్ 40.280 36.050 4.230
జే.ఎస్.భూపాలపల్లి 59.450 37.390 22.060